Tuesday, January 24, 2012

ప్రపంచంలో అయిదు ఎత్తయిన మానవ నిర్మిత డ్యాములు...!!!

        డ్యాంలను నీటి ప్రవాహాన్ని ఆపి ఆ నీటిని నిలువ చేయడానికి లేదా విద్యుత్ ఉత్పతి చేయడానికి నిర్మిస్తారని మనందరికీ తెలుసు. అయితే ప్రపంచంలో ఎత్తయిన డ్యాంలు ఏవి అనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు...!!! మీకు తెలియదా...??? అయితే ఇవిగోండి, ఆ వివరాలు మీకోసం ...!!!
1) నూరేక్ డ్యాం, తజికిస్తాన్, ఎత్తు 314 మీటర్లు 
                దీన్ని వక్ష్ నది మీద మట్టితో నిర్మించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలో అతి ఎత్తయిన డ్యాం. దీని నిర్మాణాన్ని 1961 లో మొదలు పెట్టి 1980 లో పూర్తి చేసారు.అయితే ఇదే నది మీద 334 మీటర్ల ఎత్తులో " రోగున్" అనే పేరుతో మరో డ్యాంని నిర్మిస్తున్నారు. ఈ డ్యాం నిర్మాణం పూర్తయితే నూరేక్ డ్యాం రెండవ స్థానానికి పడిపోతుంది.


2) గ్రాండ్ డిక్సేన్స్ డ్యాం, స్విట్జర్లాండ్, ఎత్తు 284 మీటర్లు:
           దీనిని స్విట్జర్లాండ్ లోని డిక్సేన్స్ నది మీద కట్టారు. దీనిని ముఖ్యంగా జల విద్యుత్ తయారు చేయడానికి కట్టారు. ఇది ప్రపంచంలో అతి ఎత్తయిన గ్రావిటీ డ్యాం. అన్ని రకాల డ్యాం కట్టడాలలో చూసుకుంటే యూరోప్లో ఇదే అతి ఎత్తయిన డ్యాం,మరియు ప్రపంచంలో రెండవ అతి ఎత్తయిన డ్యాం.
3)ఇంగురి డ్యాం, జార్జియా, ఎత్తు 272 మీటర్లు 
           ఈ డ్యాంని జార్జియాలోని జ్వారి పట్టణానికి ఉత్తర దిక్కున ఇంగురి నది మీద నిర్మించారు. ఈ డ్యాం నిర్మాణం పూర్తిగా కాంక్రీటుతో చేసారు. ఈ డ్యాం కూడా జల విద్యుత్ ఉత్పత్తి కోసమే కట్టారు. కాంక్రీటు తో నిర్మించబడిన డ్యాంలలో ఇదే ఎత్తయినది.
4) వజోంట్ డ్యాం, ఇటలీ, ఎత్తు 262 మీటర్లు.
        ఈ డ్యాం ప్రస్తుతం ఉపయోగంలో లేదు. దీని నిర్మాణం 1959 లో పూర్తయింది. అయితే 1963 లో దీనిని పూర్తి స్థాయిలో నింపే ప్రయత్నంలో మట్టి పెళ్లలు ఊడి పడి వరదలు సంభవించి దాదాపు 2000 మంది చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదానికి ఇంజనీర్ల తప్పిదమే కారణం అని తర్వాత తేల్చారు.2008 లో UNESCO ఈ డ్యాంకి జరిగిన ప్రమాదాన్ని ప్రపంచలోని అయిదవ అతి పెద్ద మానవ తప్పిదం వలన జరిగిన ప్రమాదంగా గుర్తించింది.
 5) తెహ్రి డ్యాం, ఇండియా , ఎత్తు 261 మీటర్లు.
            అవునండీ...!!! మీరు చదివింది నిజమే... ఈ డ్యాం మనదేశంలోనే ఉంది.ఈ డ్యాంని పవిత్ర గంగానదికి ఉపనది అయిన భగీరథ నది పైన  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్మించారు. ఇది కూడా జల విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించారు.
             ఇవండీ ఎత్తయిన డ్యాంలకు సంబంధించిన విషయాలు. మరిన్ని ఆసక్తికర విషయాలతో మరో టపాలో కలుస్తానండి...

No comments:

Post a Comment