Tuesday, January 31, 2012

2040 లో 50 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో భారతదేశ చిత్ర పటం... అవుట్ లుక్ పత్రిక ఆసక్తికర కథనం...!!!



                
        1953 లో ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అప్పట్లో మన దేశంలోని రాష్ట్రాలను పునర్విభజన చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకుంది. 14 రాష్ట్రాలను 9 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి ఈ కమిషన్ 38,000 మైళ్ళ దూరం ప్రయాణించి, 104 ప్రాంతాలను పర్యటించి దాదాపు 1,50,000 డాక్యుమెంట్లను పరిశీలించింది. అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితులతో పుట్టుకొస్తున్న కొత్త కొత్త రాష్ట్రాల డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అవుట్ లుక్ పత్రిక న్యూస్ రూం లో కొత్త రాష్ట్రాలతో భారత దేశ చిత్రపటాన్ని తయారు చేయాలనే ఒక మంచి ప్రయత్నం జరిగింది. అవుట్ లుక్ పత్రిక వాళ్ళు భాషా పరంగా, సంస్కృతి పరంగా, అలాగే ఆయా రాష్ట్రాల భౌగోళిక స్వరూపం దృష్ట్యా  ఈ రాష్ట్రాలను విభజించడం జరిగింది. ఇది కేవలం ఊహాజనితము మాత్రమే అని ఒక రాష్ట్రాన్ని విడగొట్టమని కాని లేదా కలిపి ఉంచమని చెప్పడానికి కాదని ఆ పత్రికలో పేర్కొన్నారు. 
     
ఈ విషయం పైన పూర్తి సమాచారం కోసం ఈ లింకుని నొక్కండి...Out Look India Website.http://www.outlookindia.com/article.aspx?279691

Source : Outlook FEB 6th 2012 మాగజైన్

Tuesday, January 24, 2012

ప్రపంచంలో అయిదు ఎత్తయిన మానవ నిర్మిత డ్యాములు...!!!

        డ్యాంలను నీటి ప్రవాహాన్ని ఆపి ఆ నీటిని నిలువ చేయడానికి లేదా విద్యుత్ ఉత్పతి చేయడానికి నిర్మిస్తారని మనందరికీ తెలుసు. అయితే ప్రపంచంలో ఎత్తయిన డ్యాంలు ఏవి అనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు...!!! మీకు తెలియదా...??? అయితే ఇవిగోండి, ఆ వివరాలు మీకోసం ...!!!
1) నూరేక్ డ్యాం, తజికిస్తాన్, ఎత్తు 314 మీటర్లు 
                దీన్ని వక్ష్ నది మీద మట్టితో నిర్మించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలో అతి ఎత్తయిన డ్యాం. దీని నిర్మాణాన్ని 1961 లో మొదలు పెట్టి 1980 లో పూర్తి చేసారు.అయితే ఇదే నది మీద 334 మీటర్ల ఎత్తులో " రోగున్" అనే పేరుతో మరో డ్యాంని నిర్మిస్తున్నారు. ఈ డ్యాం నిర్మాణం పూర్తయితే నూరేక్ డ్యాం రెండవ స్థానానికి పడిపోతుంది.


2) గ్రాండ్ డిక్సేన్స్ డ్యాం, స్విట్జర్లాండ్, ఎత్తు 284 మీటర్లు:
           దీనిని స్విట్జర్లాండ్ లోని డిక్సేన్స్ నది మీద కట్టారు. దీనిని ముఖ్యంగా జల విద్యుత్ తయారు చేయడానికి కట్టారు. ఇది ప్రపంచంలో అతి ఎత్తయిన గ్రావిటీ డ్యాం. అన్ని రకాల డ్యాం కట్టడాలలో చూసుకుంటే యూరోప్లో ఇదే అతి ఎత్తయిన డ్యాం,మరియు ప్రపంచంలో రెండవ అతి ఎత్తయిన డ్యాం.
3)ఇంగురి డ్యాం, జార్జియా, ఎత్తు 272 మీటర్లు 
           ఈ డ్యాంని జార్జియాలోని జ్వారి పట్టణానికి ఉత్తర దిక్కున ఇంగురి నది మీద నిర్మించారు. ఈ డ్యాం నిర్మాణం పూర్తిగా కాంక్రీటుతో చేసారు. ఈ డ్యాం కూడా జల విద్యుత్ ఉత్పత్తి కోసమే కట్టారు. కాంక్రీటు తో నిర్మించబడిన డ్యాంలలో ఇదే ఎత్తయినది.
4) వజోంట్ డ్యాం, ఇటలీ, ఎత్తు 262 మీటర్లు.
        ఈ డ్యాం ప్రస్తుతం ఉపయోగంలో లేదు. దీని నిర్మాణం 1959 లో పూర్తయింది. అయితే 1963 లో దీనిని పూర్తి స్థాయిలో నింపే ప్రయత్నంలో మట్టి పెళ్లలు ఊడి పడి వరదలు సంభవించి దాదాపు 2000 మంది చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదానికి ఇంజనీర్ల తప్పిదమే కారణం అని తర్వాత తేల్చారు.2008 లో UNESCO ఈ డ్యాంకి జరిగిన ప్రమాదాన్ని ప్రపంచలోని అయిదవ అతి పెద్ద మానవ తప్పిదం వలన జరిగిన ప్రమాదంగా గుర్తించింది.
 5) తెహ్రి డ్యాం, ఇండియా , ఎత్తు 261 మీటర్లు.
            అవునండీ...!!! మీరు చదివింది నిజమే... ఈ డ్యాం మనదేశంలోనే ఉంది.ఈ డ్యాంని పవిత్ర గంగానదికి ఉపనది అయిన భగీరథ నది పైన  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్మించారు. ఇది కూడా జల విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించారు.
             ఇవండీ ఎత్తయిన డ్యాంలకు సంబంధించిన విషయాలు. మరిన్ని ఆసక్తికర విషయాలతో మరో టపాలో కలుస్తానండి...

Friday, January 20, 2012

అవిభక్త కవలలు ఎలా జన్మిస్తారు...!!!అవిభక్త కవలలు వీణా వాణీ ల భవిష్యత్తు పైన నీలి నీడలు...!!! తప్పు ఎవరిది...??? విశ్లేషణ

             వీణావాణీల గురించి మన తెలుగు వారందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే గత 5 -6 సంవత్సరాలుగా మన మీడియాలో అంతగా నానుతున్న అవిభక్త కవలల పేర్లు అవి. తాజాగా ఈ అవిభక్త కవలల మీద నడుస్తున్న చర్చ నన్ను ఈ టపా రాయడానికి ప్రేరేపించింది. 
అవిభక్త కవలలు ఎలా జన్మిస్తారు?
               సాధారణంగా స్త్రీలలో విడుదలయిన అండం, పురుషుడి శుక్రకణంతో కలిసి ఫలదీకరణం చెంది పిండంగా ఏర్పడుతుంది. ఈ పిండం నవమాసాలు తల్లి గర్భంలో ఉండి శిశువుగా రూపాంతరం చెందుతుంది. సాధారణంగా ఒక తల్లి గర్భంలో ఒక పిండం మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు రెండు అండాలు రెండు శుక్రకణాలతో ఫలదీకరణం చెంది రెండు పిండాలు ఏర్పడతాయి. మరి కొన్ని సార్లు ఒక పిండం రెండుగా విడిపోయి రెండు వేర్వేరు శిశువులుగా రూపాంతరం చెందుతాయి. ఈ రెండు సందర్భాలలోనూ కవలలు జన్మిస్తారు. మొదటి సందర్భంలో జన్మించిన కవలలు ఒకేవిధంగా ఉండరు. కానీ రెండవ సందర్భంలో జన్మించిన కవలలు ఒకే విధంగా ఉంటారు. అయితే రెండవ సందర్భంలో పిండం సరిగా విభజన జరగక పోవడం వలన కానీ లేదా విభజన జరిగిన తర్వాత తిరిగి పాక్షికంగా అతుక్కోవడం గానీ జరిగినపుడు అవిభక్త కవలు ఏర్పడతారు. సాధారణంగా 2,౦౦,౦౦౦ జననాలలో ఒకరికో ఇద్దరికో ఇలా అవిభక్త కవలలు జన్మిస్తారు. ఇలా జన్మించిన వారిలో దాదాపు సగం మంది చనిపోయి జన్మిస్తారు, మరికొంత మంది పుట్టిన తరువాత మరణిస్తారు. కేవలం 25 % మంది మాత్రమే జీవించగలిగే అవకాశం ఉంటుంది.
వీణావాణీల గాధ:

                దాదాపు 8 సంవత్సరాల క్రితం ఈ అవిభక్త కవలలు జన్మించారు. వీళ్ళది వరంగల్ జిల్లాలో ఒక పల్లెటూరు. వీరు జన్మించినపుడు వీరికి ఆపరేషన్ చేయించడానికి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు వీరి తల్లిదండ్రులు. అప్పటికే ఒక అవిభక్త కవలలను విజయవంతం గా విడతీసిన ఘనత అక్కడ అప్పట్లో పనిచేసిన డాక్టర్ నాయుడమ్మ గారికి ఉంది. అయితే వీరికి అన్ని రకాల పరిక్షలు చేసి ఆపరేషన్ చేద్దామనుకునే సమయానికి అప్పటి మీడియా హడావిడి చేయడం వల్ల గానీ, నాయుడమ్మ గారి పదవీ కాలం ముగియడం వల్ల కానీ వీరిని విడతీయలేక పోయారు. తరువాత వీరి తల్లిదండ్రులు వీరిని హైదరాబాద్ లోని నిమ్స్ కి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేయబోయే సమయానికి వీణావాణీల తల్లిదండ్రులు ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టడానికి నిరాకరించే సరికి కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇక్కడ తల్లిదండ్రులు నిరాకరించడానికి ముఖ్య కారణం మీడియానే. ఎవరో ఒకరు చనిపోతారంటూ చానళ్ళు చేసిన హడావిడికి తల్లిదండ్రులు భయపడిపోయారు. ఎంతయినా కన్నవారు కదండీ... కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు ఆపరేషన్ కి ఒప్పుకున్నా డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు. కారణం కేవలం మీడియానే... చివరకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ గారు వీరికి విదేశాలలో ఆపరేషన్ చేయించడానికి కోటి రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే ఆయన మరణంతో తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడంతో వారు ఇప్పటివరకు ఆసుపత్రిలోనే ఉన్నారు.
వీణావాణీల భవిష్యత్తుపైన నీలినీడలు...తప్పు ఎవరిది???
         వీణావాణీల పోషణ పైన అటు తల్లిదండ్రులు ఇటు ప్రభుత్వం ఇద్దరూ లెక్కలు వేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. మన సాంప్రదాయం ప్రకారం పిల్లల్ని కనగానే సరిపోదు. వారి పెంపు భాద్యతలను కూడా చూసుకోవాలి. మాకు పెంచే ఆర్దిక స్తోమత లేదని తల్లిదండ్రులు మీడియా ముఖంగా చెప్పడం మన వ్యవస్థకు అవమానంలా అనిపించింది. ఇక ప్రభుత్వ విషయానికి వస్తే ఇప్పటికయినా సమర్ధమయిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ చేయించడానికి మార్గాలు వెతకాలి. అయితే ఆపరేషన్ విజయవంతం కావాలి, పిల్లలిద్దరూ బతకాలంటే మాత్రం కాస్త కష్ట సాధ్యమయిన పని. అలాంటప్పుడు పిల్లల్ని ప్రభుత్వ ఆశ్రమం లో ఉంచి జీవితాంతం ప్రభుత్వమే కాపాడాలి.

Thursday, January 19, 2012

నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు....!!!రాజకీయ నాయకుల సిగ్గులేని తనం పైన నా మనస్సాక్షికి అనిపించిన విషయాలు..

            మన దౌర్భాగ్యం ఏమోగాని పరిపక్వత కలిగిన  రాజకీయ నాయకులను చుద్దాం అంటే మచ్చుకు కుడా కానరారు. కొన్ని రోజులు వాడు అవినీతి చేసాడని వీడు, వీడు  అక్రమాలు చేసాడని వాడు కొట్టుకుంటారు. మరి కొన్ని రోజులు దమ్ముంటే మా ఊర్లో పోటి చెయ్, మా ప్రాంతంలో అడుగు పెట్టు లాంటి వ్యాఖ్యలతో రెచ్చగొట్టుకుంటారు.ఒకడేమో నాలిక కోస్తా అంటే దానికి కౌంటర్ గా మరొకడు పీక కోస్తా అంటాడు. ఒక ఉద్ధండుడెమో పడగొడతా పడగొడతా అని అరుస్తుంటే దీనికి కౌంటర్ గా మరొకడు నిలబెడతా, తొడగొడతా అంటాడు. ఒకడేమో నేను రైతుల కోసమే రాజకీయాలు చేస్తున్నానంటే మరొకడు రైతు "పచ్చ"గా ఉండటానికి ప్రాణాలయినా అర్పిస్తానని ఊదర గొడతారు. మన రొచ్చు రాజకీయాలలో ఇప్పుడు నేను ప్రస్తావించిన విషయాలు కేవలం మచ్చుకు మాత్రమే.
              అసలు ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే నిన్న అపర చాణక్యుడు, ఉద్యోగుల పాలిటి సింహ స్వప్నం, "బీప్" పోటు వీరుడు గా పేరు గాంచిన మన మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక వ్యాఖ్యని చూసి నాకు వొళ్ళు మండింది. తెలుగు జాతికి వన్నెతెచ్చిన మామగారి విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టించలేకపోయిన ఆయనగారు మన రాష్ట్రంలో ఉన్న అనుమతి లేని దివంగత ముఖ్యమంత్రి గారి విగ్రహాలను తీయిన్చేస్తాడట. ఏమండీ...!!! అసలు నట సార్వభౌమ రామారావు గారి వర్ధంతి రోజున చేయాల్సిన వ్యాఖ్యలేనా ఇవి. కేంద్రం లో చక్రం తిప్పే బలం ఉన్న నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి. పాడిన పాటే పాడరా పాసి పళ్ళ సుబ్బయ్యా అన్నట్లు ఎన్.టి.ఆర్ వర్ధంతి రోజున కూడా దివంగత ముఖ్య మంత్రి విగ్రహాల మీద పడ్డారు ఆ మహానుభావుడు. ఎందుకంటే  ఈయన గారికి దివంగత ముఖ్య మంత్రిని రోజు ఏదో ఒకటి అననిదే నిద్ర కూడా పట్టదు మరి . అసలు ఎన్.టి.ఆర్ కి భారతరత్న రాక పోవడానికి మరియు ఆయన విగ్రహం పార్లమెంటులో లేక పోవడంలో  ప్రధాన పాత్ర ఈయన గారిదేనని ఆయన తోక పత్రిక మరియు ఆ తోక కి తోక అయిన మరో ఛానలు నిన్న చర్చ కుడా నిర్వహించాయిలెండి. జనాలు ఏమనుకుంటారోనన్న భయం ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు.
             ఈ తతంగం కేవలం ఒక రాజకీయ నాయకుడికి మాత్రమే పరిమితం కాదు. అందరూ అందరే...!!! ఒక్క నాయకుడికి కూడా ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదు. ఏదయినా సమస్య వచ్చినపుడు ఒక్కడు కూడా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వరు. ఎంత సేపూ పొద్దున్న లేచి  అవతలి వాడిని ఎంత బాగా అమ్మ నా బూతులు తిడదామా అని మాత్రమే ఆలోచిస్తారు. విద్యుత్ చార్జీల పెంపు సమస్య కాదా నాయనా...??? అకాల వర్షాలతో పంట కోల్పోయిన రైతుల గురించి మీరు ఏం చేసారు. ప్రభుత్వం వాళ్లకు ఎలాగు తీరదు. ఎందు కంటే ఢిల్లీ వెళ్లి అమ్మగారి పాద సేవ లో తరించాలి...లేకుంటే  అమ్మ గారు ఆవలించలేరు...!!! మన రాష్ట్ర పార్టీలకయినా  సిగ్గుండాలి కదా... నలుగురిని వెనకేసుకుని మమ అనిపించడం తప్ప ఎంతమంది చిత్త శుద్ధి తో పని చేస్తున్నారు చెప్పండి.
           వీళ్ళ తీరు మార్చుకోక పోతే పాత ఇంకుడు గుంతలలో కొంతమందిని, బంగాళాఖాతంలో మరి  కొంతమందిని, ఢిల్లీ యమునానదిలో మిలిన వాళ్ళని పాతి పెట్టడం ఖాయం...!!! 

Wednesday, January 18, 2012

మనకు తెలియని ఆసక్తికర నిజాలు....!!! -- మూడవ భాగం

            ఇక్కడ రాసిన ఆసక్తికర నిజాలన్నీ మన తెలుగు బ్లాగరుల కోసం అంతర్జాలం నుంచి, టి.వి షోల నుంచి సేకరించినవే. శాస్త్రీయంగా ఋజువు కాబడిన అంశాలనే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. 
  1. ప్రపంచంలో అన్ని ఖండాల పేర్లు  ఏ ఆంగ్ల  అక్షరంతో అయితే మొదలవుతాయో  అదే ఆంగ్ల  అక్షరంతో ముగుస్తాయి ( అమెరికా ఖండాన్ని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఉత్తర , దక్షిణ భాగాలుగా పిలుచుకుంటారు) ...!!!
  2. మన శరీరంలో అత్యంత బలమయిన కండరం నాలుక....!!!
  3. పందులు తల పైకి ఎత్తి ఆకాశంలోకి చూడటం అనేది భౌతికంగా అసాధ్యం అయిన పని.
  4. కీబోర్డ్ లో ఒక వరుసలో ఉండే అక్షరాలను ఉపయోగించి వ్రాయగలిగిన అతి పొడవయిన పదం TYPEWRITER ....!!!
  5. మీ మోచేతిని మీరు కొరుక్కోవడం అనేది అసాధ్యమయిన పని...!!!!
  6. ధృవపు ఎలుగుబంట్లు అన్నీ ఎడమ చేతి వాటం కలిగి ఉంటాయట...!!!
  7. 111,111,111 x 111,111,111 = 12,345,678,987,654,321 ....!!!!
  8. మీరు ఏదయినా పార్కు లో రెండు కాళ్ళు పైకి ఎత్తిన గుర్రం మీద మనిషి విగ్రహాన్ని చూస్తే ఆ వ్యక్తి యుద్ధం లో చనిపోయినట్లు లెక్కట...!!!
  9. మీ అంతట మీరు శ్వాస ఆపుకుని ఆత్మహత్య చేసుకోవడం అనేది అసంభవం...!!! దయ చేసి ప్రయత్నించకండి...!!!
  10. పెంగ్విన్లకు ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చగలిగే శక్తి ఉందట...!!!
  11. మన సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలలో సవ్య దిశలో( CLOCK  WISE )తిరిగే గ్రహం వీనస్ మాత్రమే...!!! 
  12. ఈ విషయాలన్నీ చదివిన వాళ్ళలో 90 శాతం మంది వారి మోచేతిని కోరుక్కోవడానికి ప్రయత్నిస్తారట....!!!!
 మరి కొన్ని ఆసక్తికర అంశాల కోసం మరొక టపా కోసం ఎదురు చూడండి...!!!

Monday, January 16, 2012

చిన్నప్పటి చిలిపి పనులు / అమ్మమ్మ జ్ఞాపకాలు...!!!

                    అమ్మమ్మ సుదూర లోకాలకు వెళ్లి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా,భాస్కర రామి రెడ్డి గారు ప్రచురించిన కుసుమాంజలి పత్రికకు మరింత ఆదరణ లభిస్తుందని ఆశిస్తూ మా అమ్మమ్మ తో కలిసి నేను చిన్నపుడు చేసిన తులిపి పనులను ఇక్కడ సరదాకి వివరిస్తున్నా...!!!
                   మా తాత గారి పేరు వెంకురెడ్డి , ఉపాధ్యాయుడిగా పనిచేసేవేవారు. వెంకురెడ్డి మాస్టర్ గారంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎంతో గౌరవం మరియు భక్తి కూడా. ఉపాధ్యాయ వృత్తి తో పాటు మా తాత గారు ఆయుర్వేద వైద్యం కూడా చేసే వారు. ఇక మా అమ్మమ్మ విషయానికి వస్తే పేరు కుసుమాంబ అప్పట్లో తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్నా, కొంచెం కష్ట పడితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నాకూడా మా అమ్మమ్మ వాళ్ళ నాన్న గారు తన దగ్గరే శిష్యరికం చేస్తున్న మా తాతయ్యకి  మా అమ్మమ్మనిచ్చి పెళ్లి చేయడానికే మొగ్గు చూపారు. అలా మా అమ్మమ్మ తాతయ్య ఒక్కటయ్యారు. మా అమ్మమ్మ తాతయ్య లకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. నేను చిన్న కూతురికి మొదటి సంతానం గా జన్మించాను.నేను పుట్టింది ప్రకాశం జిల్లా లోని వెలిగండ్ల మండలం లో ఉన్న జిల్లెల్లపాడు గ్రామం లో. పుట్టటమయితే మా అమ్మకి పుట్టాను కాని చిన్న తనం నుంచి నాకు అన్నీ మా అమ్మమ్మే. ఊహ తెలిసిన దగ్గరినుండి నేను అమ్మమ్మ దగ్గరే పెరగటం వల్లనో ఏమో కానీ మా అమ్మమ్మ  గారి ని నేను అమ్మ అని మాత్రమే పిలుస్తాను. అప్పుడప్పుడు నన్ను చూడటానికి మా అమ్మ వచ్చేది. నాకు ఏదయినా అవసరం వచ్చి అమ్మా అని పిలిస్తే ఇద్దరూ పలికేవారు. అప్పుడు నాకు చాలా ఆనందం గా అనిపించేది, ఇద్దరు అమ్మలు ఉన్నారని.
                        చిన్న తనం నుంచి నా మీద మా అమ్మమ్మ కు ప్రత్యేకమయిన అభిమానం. నా మీద ఈగ కూడా వాలనిచ్చేది కాదు.. చిన్నపుడు నేను వేసినాన్ని తులిపి వేషాలు ఎవరూ వేసి వుండరు. నాకు 6 సంవత్సరాల వయసు ఉన్నపుడే చిలిపి కృష్ణుడి వేషాలు బాగా వేసేవాడినట. ఒకసారి మా అమ్మమ్మ పూలు తీసుకు రమ్మని 2 రూపాయలు ఇస్తే ఆ రెండు రూపాయలకు బొరుగులు( మరమరాలు ) కొనుక్కుని మా ఊరి పక్కనే ఉన్న బంతి పూల తోటలోకి వెళ్లి బొరుగులు తింటూ పూలు దొంగతనం చేసి ఇంటికి పట్టుకెళ్ళానట . ఇంతకి నేను దొంగతనంగా పూలు తీసుకెళ్ళిన విషయం మా అమ్మమ్మకి ఎలా తెలిసిందా అని అనుకుంటున్నారా...!!!. అసలు నన్ను తీసుకు రమ్మని పంపింది మల్లెపూలకండి, బంతిపూలకు కాదు...!!!!. గట్టిగా దమాయించి అడిగే సరికి నిజం చెప్పేసానట. ఇక చూస్కోండి... మా తాతయ్యకు ఎక్కడ చెప్పిద్దో అని భయం వేసి స్నానాల గది లో దాక్కున్నానట. కానీ మంచి అమ్మమ్మ కదా, మా తాతయ్యకి ఏమి చెప్పలేదులెండి. ఇంకో సారి మా ఇంటి పక్కన ఉండే అమ్మాయి నేను బంక మట్టితో చేసుకున్న ట్రాక్టర్ మీద నీళ్ళు పోసిందని ఆ పిల్ల వీపు విమానం మోత మోగించానట. ఈ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వాళ్ళ నాన్న నా వీపు విమానం మోత మోగించడానికి వస్తే మా అమ్మమ్మ సర్ది చెప్పి ఆయనను పంపించేసిందట.

                 నేను పెరిగింది  పల్లెటూరి వాతావరణం కావడం  తో మా ఊర్లో ఎక్కువ టి.వి లు ఉండేవికావు. నాకు తెలిసి అప్పట్లో కేవలం రెండే టి.వి లు ఉండేవి, నేను సమయానికి ఇంటికి రాక పోతే మా అమ్మమ్మ మరెక్కడా వెతకకుండా నేరుగా ఆ టి.వి లు ఉండే ఇళ్లకే వచ్చేది. ఈ విషయం నాకు బాగా గుర్తు. ప్రతీ  ఆదివారం సాయంత్రం వచ్చే తెలుగు సినిమా , ప్రతి శుక్ర వారం వచ్చే చిత్రలహరి చూడటానికి వచ్చే జనం తో ఆ టి.వి యజమానుల ఇల్లు కిక్కిరిసి పోయేవి. కానీ నాకు మాత్రం చోటు దొరికేది. అదెలాగంటారా...!!! ఏముందండి... మా తాత కొడుకుని తలుపు తియ్యన్డోయ్ అని అరిచి గోల పెట్టేవాడిన ట. ఇంకేముంది తాత కొడుకు అనగానే అందరూ పక పక నవ్వి వాళ్ళ వొళ్ళో కుర్చోబెట్టుకొనే వారు.  
                   ఇక ఊహ తెలిసిన తర్వాత చేసిన అల్లరి పనులకు కూడా అమ్మమ్మ వెనకేసుకుని వచ్చింది. మా తాతయ్య ఉపాధ్యాయ వృత్తి నుంచి విశ్రాంతి తీసుకున్నాక మేము గుంటూరు జిల్లా లోని వినుకొండ ప్రాంతం లో గల గాంధీనగరం అనే గ్రామానికి వలస వచ్చాము. నేను 3 , 4  తరగతులు అదే ఊర్లో చదివాను. ఇక్కడ నా అల్లరి మరీ ఎక్కువ అవడం తో నన్ను హాస్టల్ లో పడేద్దామనే నిర్ణయానికి వచ్చారు. అలా 5 వ తరగతి తో మొదలయిన నా హాస్టల్ ప్రస్థానం ఎం.బి.బి.ఎస్ అయ్యే వరకు కొనసాగింది. మధ్యలో దసరా , సంక్రాంతి పండుగలకు సెలవులు ఇస్తే బాగా పెరిగిన జుట్టుతో, ఒక పెద్ద మూట మాసిన బట్టలు వేసుకుని నేరుగా మా అమ్మమ్మ దగ్గరికే వెళ్ళేవాడిని. ఇవన్ని తలచుకుంటుంటే ఒక్కోసారి ఆనందం గాను , మరి కొన్ని సార్లు బాధ గాను ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మా అని పిలిస్తే పలకడానికి ఒక అమ్మ మాత్రమే ఉంది.    
                 అమ్మమ్మ జ్ఞాపకాలతో మా మామయ్య తీసుకు వచ్చిన కుసుమాంజలి పత్రిక ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కుసుమాంజలి పత్రిక చూడటానికి ఇక్కడ నొక్కండి!!!!

Thursday, January 05, 2012

భారతదేశంలో అత్యంత పొడవయిన రైలుమార్గం మరియు ఎక్కువదూరం ప్రయాణించే రైలు...!!!

                    నిన్న సరదాగా రైల్వే వెబ్ సైట్ కెలుకుతుంటే ఒక ఆసక్తి కరమయిన విషయం తెలుసు కున్నాను. ఈ విషయం మన బ్లాగర్లలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కాని నాకు మాత్రం కొత్తగా అనిపించి తెలియని వారికి ఈ విషయం చెబుదామని ఈ టపా రాస్తున్నాను
                   మన భారత రైల్వేశాఖ వారు గత నవంబర్ 21 , 2011 వ తేదిన ఒక కొత్త రైలుని ప్రవేశ పెట్టారు. సాధరణంగా ఏవయినా కొత్త పథకాలు, ప్రదేశాలకు ఆయా రాజకీయ నాయకుల పేర్లు పెట్టే మన ప్రభుత్వం ఈ రైలుకి వివేక్ ఎక్స్ ప్రెస్ అని  స్వామి వివేకానంద పేరు పెట్టడం నాకు ఆనందాన్ని కలిగించింది.
                      అన్నట్లు ఈ రైలు అస్సాంలోని డిబ్రుగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి మధ్య  ప్రయాణిస్తుంది.  ఈ రైలు అస్సాం, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గుండా 4286 కిలోమీటర్ల దూరం  ప్రయాణిస్తుంది
                  ప్రతి శనివారం మద్యాహ్నం రెండు గంటలకు కన్యాకుమారిలో బయలుదేరే ఈ రైలు బుధవారం తెల్లవారుఝామున 3 .30 కి డిబ్రుగర్ చేరుకుంటుంది. (డిబ్రుగర్ నుంచి మొదలయ్యే  రైలు వేళలు పటం లో చూపబడ్డాయి.)అన్నట్లు ఈ రైలు ప్రయాణం కూడా చవకేనండోయ్. కన్యాకుమారి  నుంచి డిబ్రు గర్ కు కేవలం 673 రూపాయలతో ప్రయాణం చేయవచ్చు. ఈ రైలు ప్రవేశ పెట్టడంతో ఎక్కడో దూరంగా విసిరేసినట్లు ఉండే ఈశాన్య భారతానికి మిగిలిన భారత దేశంతో సంబంధాలు మరింత మెరుగు పడతాయని నిపుణులు భావిస్తున్నారు.
                రెండు వారాలు ఉద్యోగానికి శెలవు పెట్టి ఈ రైలు ఎక్కితే భారత దేశాన్ని  ఈ మూల నుంచి ఆ మూలకు ఎంచక్కా చుట్టి రావచ్చు కదండీ....!!! ఏమంటారు....!!!

Wednesday, January 04, 2012

మనకు తెలియని ఆసక్తికరమయిన నిజాలు -- రెండవభాగం

  1. మీరు క్యారెట్లు ఎక్కువగా తింటే గనుక మీ శరీరం ఆరెంజ్ రంగులోకి మారే అవకాశం ఉంది.
  2. ఆక్టోపస్ కి మూడు గుండెలు ఉంటాయి...!!!
  3. మన శరీరంలో 20 నుంచి 30 లక్షల స్వేద గ్రంధులు ఉంటాయి.
  4. బ్లూ వేల్ ( నీటి తిమింగలం ) నాలుక బరువు ఏనుగు బరువు కంటే ఎక్కువ ఉంటుంది.
  5. టైగర్ షార్క్ యొక్క పిండాలు తల్లి గర్భంలో ఒక దానితో ఒకటి కొట్టుకుంటాయి. ఏ పిండం అయితే గెలుస్తుందో అది మాత్రమే గర్భంలో పెరుగుతుంది.
  6. మనిషి కాకుండా వేలు ముద్రలు కలిగి ఉండే మరొక జంతువు  కోలాస్ ( koalas ) మాత్రమే
  7. మాజీ అమెరికా అద్యక్షుడు బిల్ క్లింటన్ తన 8 సంవత్సరాల పదవీకాలంలో కేవలం 2 సార్లు మాత్రమే ఈ-మెయిల్ పంపాడు.
  8. ప్రపంచంలోని అతి పెద్ద మాంటేస్సోరి స్కూల్ మన భారతదేశం లోనే ఉంది. 2002 వ సంవత్సరంలో ఈ స్కూల్లో 26312 మంది పిల్లలు ఉండేవారు.
  9. అన్నిటికంటే పెద్ద మెదడు ఉన్న జంతువు స్పెర్మ్ వేల్ ( sperm  whale ).దాని మెదడు బరువు 9 .07  కి.గ్రా ఉంటుంది.
  10. సాధారణం గా మనిషి కనురెప్పలు నిమిషానికి 15 సార్లు కొట్టుకుంటాయి. కానీ ఈ విషయం చదివిన తరువాత కనురెప్పలు కొట్టుకునే వేగం పెరుగుతుంది....!!!!

Monday, January 02, 2012

కల్తీ మద్యం తో మరణాలు ఎందుకు సంభవిస్తాయి? విశ్లేషణ !

              కల్తీ సారా తాగి కృష్ణా జిల్లాలో 20 మంది మృతి.......కల్తీ సారా తాగి పశ్చిమబెంగాల్ లో 170  మంది మృతి..... ఇలాంటి వార్తలు ఈ మధ్య మనం వింటున్నాం...నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2010  లో 1202  మంది కల్తీ సారా తాగి చనిపోగా 2011 లో దాదాపు 900 మంది కల్తీ సారా తాగి మృత్యువాత పడినట్లు అంచనా. కొత్త సంవత్సర సంబరాల్లో అందరూ మునిగితేలుతుండగా వచ్చిన కృష్ణా జిల్లా వార్త ఒక్క సారిగా నా మనసుని కలచి వేసింది. కొత్త సంవత్సరం తొలిరోజంతా ఈ ఘటన మీద విశ్లేషణ చేయగా  అనేక ఆసక్తికర  విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అసలు మన దేశం లోనే ఎందుకు ఎక్కువగా ఈ మరణాలు సంభవిస్తున్నాయి...???
              మనదేశంలో మద్యం కంపెనీలు తయారు చేసే మద్యం మోలాసిస్ (molases ) నుంచి తయారు చేస్తారు. ఈ మొలాసిస్ మనదేశంలో ఎక్కువగా ఉండే చక్కెర కర్మాగారాల నుంచి వ్యర్ధ పదార్ధంగా లభిస్తుంది.ఈ మద్యంలో కిక్ కోసం రెక్టిఫయిడ్ స్పిరిట్ ని కలుపుతారు. ఆ తరువాత ఆ మద్యాన్ని డిస్టిల్లేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఇలా తయారు చేయబడిన మద్యాన్ని చట్ట ప్రకారం అమ్ముతారు. ఈ మద్యం విలువ నాటు సారా విలువ తో పోలిస్తే చాలా ఎక్కువ గా ఉంటుంది. భారత దేశంలో 60 శాతం మంది మద్యం ప్రియులు ఈ మద్యాన్ని కొనగలిగే స్థితి లో లేరని విశ్లేషకులు చెబుతున్నారు.
              ఇక నాటు సారా తయారీ విషయానికి వస్తే ఈ మద్యాన్ని తయారు చేయడం చాలా తేలిక. సాధారణం గా ఈ మద్యాన్ని బెల్లం ఊట నుంచి తయారు చేస్తారు.ఇలా తయారు చేసిన మద్యంలో కిక్ కోసం మిథనాల్ లేదా అమ్మోనియం నైట్రేట్ ని కలుపుతారు. ఈ రసాయకాలు చాలా ప్రమాద కరమయినవి. ఒక మనిషి ప్రాణం తీయడానికి 30 మి.లీ మిథనాల్ సరిపోతుందంటే మిథనాల్ ఎంత ప్రమాదకరమయినదో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ మద్యం తయారీలో సుద్ధి చేయడం అనే ప్రక్రియ సరిగా ఉండదు. ఈ నాటు సారా చాలా తక్కువ ధరకు లభిస్తుంది. కొన్ని ప్రదేశాలలో ఈ నాటు సారా తయారి ఒక కుటీర పరిశ్రమ గా వర్దిల్లుతుందంటే మన దేశం లో పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. మేలిమి మద్యం కొనుగోలు చేయలేని పేద ప్రజలు తక్కువ ధరకు లభించే ఈ నాటు సారా  వైపు మొగ్గు చూపుతున్నారు.
              నాటు సారా తయారు చేయడం మనదేశం లో చట్టరీత్యా నేరం. అయితే ఎక్సైజ్ శాఖ కాసుల కక్కుర్తో  లేక ప్రజల లెక్కలేని తనమో గానీ ఎక్కడో ఒక చోట ఈ మద్య తయారీ నిరాటంకం గా జరుగుతూనే ఉంది. ఒక్కో సారి మన ఎక్సైజ్ శాఖ అధికారులు లంచం తీసుకుని పరిశ్రమను ప్రోత్సహిస్తున్నారు. మరి కొన్ని సందర్భాలలో దాడులు చేయడానికి  వెళ్ళిన ఎక్సైజ్ శాఖ అధికారులపై నాటు సారా వ్యాపారాలు తిరగబడటం తో మన అధికారులు వెను తిరిగి వస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో నాటుసారా తాగి ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికయినా ప్రజలు, ప్రభుత్వం లో మార్పువచ్చి ఇలాంటి వార్తలు మన చెవిన పడకుండా ఉంటాయని ఆశిద్దాం.