Wednesday, February 29, 2012

ఒకే ఒక్క తుఫానుతో అదృశ్యం అయి కాలగర్భంలో కలిసిపోయిన ధనుష్కోటి పట్టణం వివరాలు...!!!

                    ప్రతి సంవత్సరం మనం ఎన్నో వాతావరణ మార్పులు చూస్తుంటాం...ఎండలకు కొంతమంది పండుటాకుల్లా రాలిపోతుంటారు. చలికి కొంతమంది జీవితం గడ్డకట్టుకుపోతుంది. తుఫానులకి కొంతమంది ప్రాణాలు నీటిలో కలిసిపోతుంటాయి. సునామీకి ఊర్లు కొట్టుకుపోవడం కూడా చూశాం. కానీ ఒకే ఒక్క తుఫానుకి ఒక మధ్య తరహా పట్టణం చరిత్రలో కలిసిపోవడం ఎపుడయినా చూసారా...!!! కనీసం చదివారా...!!! ఇది ఇప్పటి సంఘటన కాదు... ఈ సంఘటన జరిగినప్పటికీ మనలో చాలా మంది జన్మించి ఉండరు. కొంతమంది చిన్న పిల్లలుగా ఉండి ఉంటారు.  ఈ పట్టణం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా .... అయితే చదివేయండి.


                               ధనుష్కోటి.... చారిత్రాత్మక పట్టణం...స్వామీ వివేకానంద గారు 1892 లో విదేశీ పర్యటనకు వెళ్లి 1897 లో భారత దేశం తిరిగి వచ్చినపుడు ఇక్కడే కాలు మోపాడు. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు జన్మించిన పట్టణం కూడా ఇదే. ఈ పట్టణం రామేశ్వరం పంబన్  ద్వీపానికి చిట్ట చివరన ఉంటుంది. ఇక్కడినుంచి శ్రీలంక కేవలం 29 కిలోమీటర్లు.   ఇక్కడి నుంచే రాముడు శ్రీలంకకు వెళ్ళడానికి వంతెన ఏర్పాటు చేసుకున్నాడని చరిత్ర చెపుతుంది. ఇక్కడ ఇప్పటికీ ఆ వంతెన తాలుకు అవశేషాలను చూడవచ్చు. ఈ వంతెన శాటిలైట్ చిత్రాలలో కూడా స్పష్టంగా కనబడుతుంది ( పైన చిత్రం లో చూడండి ).హిందూ మహా సముద్రం మరియు బంగాళా ఖాతం ఇక్కడే కలుస్తాయి. రెండు సముద్రాల మధ్యన వర్ణ భేదం స్పష్టంగా చూడవచ్చు. అయితే 1964 లో సంభవించిన ఒక తుఫాను ధాటికి ఈ పట్టణం అంతా కనుమరుగయిపోయింది.


అసలు 1964 డిసెంబర్ 22 అర్ధ్రరాత్రి కి ముందు ధనుష్కోటి ఎలా ఉండేది?
                                1964 కి ముందు ధనుష్కోటి పర్యాటక రంగంలో మరియు పుణ్యక్షేత్రంగా ఒక వెలుగు వెలుగుతూ ఉండేది. ఇక్కడి నుంచి శ్రీలంక కేవలం 29 కిలోమీటర్ల దూరం కావడం వలన అప్పట్లో పర్యాటకులను,సాధారణ ప్రయాణికులను శ్రీలంక చేరవేయడానికి ఇక్కడినుంచి ఫెర్రీ సర్వీసులు కూడా నడిచేవి. పర్యాటకులకు భక్తులకు వసతి కలిపించడానికి ఇక్కడ    హోటళ్ళు, ధర్మశాలలు, బట్టల దుకాణాలు ఉండేవి. భారత భూభాగం నుంచి పంబన్ రైలు వంతెన మీదుగా ధనుష్కోటి పట్టణం వరకు ఒక రైలు మార్గం కూడా ఉండేది.మద్రాసు పట్టణం నుంచి ధనుష్కోటి వరకు బోట్ మెయిల్ అనే పేరుతో ఒక రైలు కూడా నడిచేది. అలాగే ఒక చర్చి, రైల్వే స్టేషన్, రైల్వే ఆసుపత్రి, ఉన్నత విద్యాలయం, పోస్ట్ ఆఫీసు, కస్టమ్స్ మరియు ఓడ రేవు కార్యాలయాలు కూడా ఉండేవి. ఇక రామాలయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం పూజలతో కళకళలాడుతూ ఉండేసి.


1964 డిసెంబర్ 22 అర్ధ్రరాత్రి ఎం జరిగింది?
                                  1964 డిసెంబర్ 17 న దక్షిణ అండమాన్ ( బంగాళాఖాతం) సముద్రం లో ఏర్పడిన అల్ప పీడనం డిసెంబర్ 19 కి తుఫానుగా రూపాంతరం చెందింది. డిసెంబర్ 22 నాటికి దాదాపు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ధనుష్కోటి పట్టణాన్ని చుట్టి వేసింది. దాదాపు 5 మీటర్ల మేర ఎగసిపడిన అలలు సముద్ర మట్టానికి కేవలం 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో ఉండే ధనుష్కోటి పట్టణం మీద విరుచుకు పడ్డాయి. అగ్నికి ఆజ్యం తోడయినట్లు ఆలల ఉధృతికి భీకరమయిన గాలులు తోడవడంతో కేవలం అరగంట వ్యవధిలో ధనుష్కోటి పట్టణం అంతా నేలమట్టం అయిపొయింది. కేవలం కొన్ని ప్రభుత్వ భవనాల మొండి గోడలు మాత్రమే మిగిలాయి. ఊరు మొత్తం ఇసుక మరియు శవాల దిబ్బగా మారింది. ఇసుకలోనుంచి అన్ని శవాలను బయటికి తీయడానికి దాదాపు వారం రోజులు పట్టిందట. తుఫాను రాకను ముందుగా పసిగట్టి దూరప్రాంతాలకు వెళ్ళిన కొంతమందిని మినహాయిస్తే దాదాపు ఆ రాత్రి ఆక్కడ ఉన్నవాళ్ళందరి ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. 1915 మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది .

ఆ రోజు ధనుష్కోటి వెళ్ళే పంబన్- ధనుష్కోటి పాసింజర్ రైలు గమ్యం చేరిందా...??? 
                           పంబన్ నుంచి  110 మంది ప్రయాణికులతో 5 గురు రైల్వే సిబ్బందితో  బయలుదేరిన రెగ్యులర్ పాసింజర్ రైలు( ట్రైన్ నంబర్ 653 )మరికొద్ది క్షణాల్లో రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది అన్న సమయంలో అటుగా వచ్చిన భయంకరమయిన అలల ధాటికి సముద్రం లోకి  కొట్టుకు  పోయింది . ఆ సమయంలో  ట్రైన్ లో  ఉన్నసిబ్బందితో సహా అందరూ  జల సమాధి అయ్యారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడం వలన పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉందని లేకపోతే మరింతమంది చనిపోయి ఉండే వారని రైల్వే అధికారులు చెప్పారు.




ఆనాటి దుర్ఘటనకు మూగ సాక్ష్యాలు: ఫోటోలు:

చర్చి అవశేషాలు:

గుడి అవశేషాలు :


రైల్వే స్టేషన్ మరియు రైల్వే ఆసుపత్రి అవశేషాలు:


రైలు పట్టాల అవశేషాలు:


ఫెర్రీ సర్వీసు నడిపింది ఇక్కడి నుంచే:


ఘోస్ట్ టౌన్ గా ప్రకటించిన మద్రాసు ప్రభుత్వం.
                           ఈ దుర్ఘటన జరిగిన తరువాత మద్రాసు ప్రభుత్వం ధనుష్కోటి పట్టణం నివాస యోగ్యం కాదని , దానిని ఘోస్ట్ టౌన్ గా ప్రకటించడంతో ధనుష్కోటి పట్టణం చరిత్ర లో కలిసిపోయింది. 


ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ? 
                         ఇప్పుడు అక్కడ కేవలం 5 -6 కుటుంబాల వారు మాత్రమే అక్కడ నివసిస్తున్నారు. అక్కడికి వచ్చిన యాత్రికులకి మంచి నీరు, తిను బండారాలు అమ్మి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ పర్యాటకరంగం మొగ్గ తొడుగుతుంది. ధనుష్కోటి వరకు నాలుగు లైన్ల రోడ్ వేయాలని, ధనుష్కోటి నుంచి శ్రీలంకకు  ఫెర్రీ సర్వీసులు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇవన్నీ జరిగి ధనుష్కోటికి పూర్వ వైభవం వస్తుందని ఆశిద్దాం.

భారతదేశపు తొలి సముద్రపు వంతెన పంబన్ బ్రిడ్జి వివరాలకోసం ఈ లింకు నొక్కండి.  http://drvenkatasubbareddy.blogspot.in/2012/02/blog-post_5699.html

10 comments:

  1. GOOD INFORMATION. WE ARE WAITING FOR THIS KIND OF POSTS.....

    ReplyDelete
  2. ధనుష్కోటి గురించి - మా చిన్నప్పుడు తను చూసి వచ్చిన ధనుష్కోటి గురించి మా అమ్మమ్మ చెప్తుంటే నోళ్ళు తెరుచుకుని వినేవాళ్లం..సముద్రం మీద రైలు ప్రయాణం గురించి కథలు కథలుగా చెప్తూ ఉంటే. ఎప్పుడు వెళ్ళి చూస్తామా అని. కానీ అది ఇలా నీళ్ళపాలయిందని బహుశ అమ్మమ్మకి కూడా తెలీదేమో . మీరు రాసిన విధానం ఫోటోలు కూడా చాలా బావున్నాయి. అమ్మమ్మని, ధనుష్కోటిని గుర్తుచేసినందుకు మీ టపా మరీ నచ్చింది.

    ReplyDelete
  3. really interesting post.

    ReplyDelete
  4. వినోద్ గారు, సుధా గారు, కృష్ణ గారు, అనామకుడు/ అనామిక గారు........ధన్యవాదములు.

    ReplyDelete
  5. photos display kavatam ledandi

    ReplyDelete
    Replies
    1. MMD gaaru...please refresh your browser, if the problem still persist please try with another browser. Any way thanks for your comment.

      Delete
  6. photos display kavatam ledandi..... anyway good info. keep posting. thanks

    ReplyDelete
    Replies
    1. MMD gaaru...please refresh your browser, if the problem still persist please try with another browser.My browser is showing the pictures. Any way thanks for your comment.

      Delete
  7. thank for sharing good information reddy garu.

    ReplyDelete