Monday, January 16, 2012

చిన్నప్పటి చిలిపి పనులు / అమ్మమ్మ జ్ఞాపకాలు...!!!

                    అమ్మమ్మ సుదూర లోకాలకు వెళ్లి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా,భాస్కర రామి రెడ్డి గారు ప్రచురించిన కుసుమాంజలి పత్రికకు మరింత ఆదరణ లభిస్తుందని ఆశిస్తూ మా అమ్మమ్మ తో కలిసి నేను చిన్నపుడు చేసిన తులిపి పనులను ఇక్కడ సరదాకి వివరిస్తున్నా...!!!
                   మా తాత గారి పేరు వెంకురెడ్డి , ఉపాధ్యాయుడిగా పనిచేసేవేవారు. వెంకురెడ్డి మాస్టర్ గారంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎంతో గౌరవం మరియు భక్తి కూడా. ఉపాధ్యాయ వృత్తి తో పాటు మా తాత గారు ఆయుర్వేద వైద్యం కూడా చేసే వారు. ఇక మా అమ్మమ్మ విషయానికి వస్తే పేరు కుసుమాంబ అప్పట్లో తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్నా, కొంచెం కష్ట పడితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నాకూడా మా అమ్మమ్మ వాళ్ళ నాన్న గారు తన దగ్గరే శిష్యరికం చేస్తున్న మా తాతయ్యకి  మా అమ్మమ్మనిచ్చి పెళ్లి చేయడానికే మొగ్గు చూపారు. అలా మా అమ్మమ్మ తాతయ్య ఒక్కటయ్యారు. మా అమ్మమ్మ తాతయ్య లకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. నేను చిన్న కూతురికి మొదటి సంతానం గా జన్మించాను.నేను పుట్టింది ప్రకాశం జిల్లా లోని వెలిగండ్ల మండలం లో ఉన్న జిల్లెల్లపాడు గ్రామం లో. పుట్టటమయితే మా అమ్మకి పుట్టాను కాని చిన్న తనం నుంచి నాకు అన్నీ మా అమ్మమ్మే. ఊహ తెలిసిన దగ్గరినుండి నేను అమ్మమ్మ దగ్గరే పెరగటం వల్లనో ఏమో కానీ మా అమ్మమ్మ  గారి ని నేను అమ్మ అని మాత్రమే పిలుస్తాను. అప్పుడప్పుడు నన్ను చూడటానికి మా అమ్మ వచ్చేది. నాకు ఏదయినా అవసరం వచ్చి అమ్మా అని పిలిస్తే ఇద్దరూ పలికేవారు. అప్పుడు నాకు చాలా ఆనందం గా అనిపించేది, ఇద్దరు అమ్మలు ఉన్నారని.
                        చిన్న తనం నుంచి నా మీద మా అమ్మమ్మ కు ప్రత్యేకమయిన అభిమానం. నా మీద ఈగ కూడా వాలనిచ్చేది కాదు.. చిన్నపుడు నేను వేసినాన్ని తులిపి వేషాలు ఎవరూ వేసి వుండరు. నాకు 6 సంవత్సరాల వయసు ఉన్నపుడే చిలిపి కృష్ణుడి వేషాలు బాగా వేసేవాడినట. ఒకసారి మా అమ్మమ్మ పూలు తీసుకు రమ్మని 2 రూపాయలు ఇస్తే ఆ రెండు రూపాయలకు బొరుగులు( మరమరాలు ) కొనుక్కుని మా ఊరి పక్కనే ఉన్న బంతి పూల తోటలోకి వెళ్లి బొరుగులు తింటూ పూలు దొంగతనం చేసి ఇంటికి పట్టుకెళ్ళానట . ఇంతకి నేను దొంగతనంగా పూలు తీసుకెళ్ళిన విషయం మా అమ్మమ్మకి ఎలా తెలిసిందా అని అనుకుంటున్నారా...!!!. అసలు నన్ను తీసుకు రమ్మని పంపింది మల్లెపూలకండి, బంతిపూలకు కాదు...!!!!. గట్టిగా దమాయించి అడిగే సరికి నిజం చెప్పేసానట. ఇక చూస్కోండి... మా తాతయ్యకు ఎక్కడ చెప్పిద్దో అని భయం వేసి స్నానాల గది లో దాక్కున్నానట. కానీ మంచి అమ్మమ్మ కదా, మా తాతయ్యకి ఏమి చెప్పలేదులెండి. ఇంకో సారి మా ఇంటి పక్కన ఉండే అమ్మాయి నేను బంక మట్టితో చేసుకున్న ట్రాక్టర్ మీద నీళ్ళు పోసిందని ఆ పిల్ల వీపు విమానం మోత మోగించానట. ఈ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వాళ్ళ నాన్న నా వీపు విమానం మోత మోగించడానికి వస్తే మా అమ్మమ్మ సర్ది చెప్పి ఆయనను పంపించేసిందట.

                 నేను పెరిగింది  పల్లెటూరి వాతావరణం కావడం  తో మా ఊర్లో ఎక్కువ టి.వి లు ఉండేవికావు. నాకు తెలిసి అప్పట్లో కేవలం రెండే టి.వి లు ఉండేవి, నేను సమయానికి ఇంటికి రాక పోతే మా అమ్మమ్మ మరెక్కడా వెతకకుండా నేరుగా ఆ టి.వి లు ఉండే ఇళ్లకే వచ్చేది. ఈ విషయం నాకు బాగా గుర్తు. ప్రతీ  ఆదివారం సాయంత్రం వచ్చే తెలుగు సినిమా , ప్రతి శుక్ర వారం వచ్చే చిత్రలహరి చూడటానికి వచ్చే జనం తో ఆ టి.వి యజమానుల ఇల్లు కిక్కిరిసి పోయేవి. కానీ నాకు మాత్రం చోటు దొరికేది. అదెలాగంటారా...!!! ఏముందండి... మా తాత కొడుకుని తలుపు తియ్యన్డోయ్ అని అరిచి గోల పెట్టేవాడిన ట. ఇంకేముంది తాత కొడుకు అనగానే అందరూ పక పక నవ్వి వాళ్ళ వొళ్ళో కుర్చోబెట్టుకొనే వారు.  
                   ఇక ఊహ తెలిసిన తర్వాత చేసిన అల్లరి పనులకు కూడా అమ్మమ్మ వెనకేసుకుని వచ్చింది. మా తాతయ్య ఉపాధ్యాయ వృత్తి నుంచి విశ్రాంతి తీసుకున్నాక మేము గుంటూరు జిల్లా లోని వినుకొండ ప్రాంతం లో గల గాంధీనగరం అనే గ్రామానికి వలస వచ్చాము. నేను 3 , 4  తరగతులు అదే ఊర్లో చదివాను. ఇక్కడ నా అల్లరి మరీ ఎక్కువ అవడం తో నన్ను హాస్టల్ లో పడేద్దామనే నిర్ణయానికి వచ్చారు. అలా 5 వ తరగతి తో మొదలయిన నా హాస్టల్ ప్రస్థానం ఎం.బి.బి.ఎస్ అయ్యే వరకు కొనసాగింది. మధ్యలో దసరా , సంక్రాంతి పండుగలకు సెలవులు ఇస్తే బాగా పెరిగిన జుట్టుతో, ఒక పెద్ద మూట మాసిన బట్టలు వేసుకుని నేరుగా మా అమ్మమ్మ దగ్గరికే వెళ్ళేవాడిని. ఇవన్ని తలచుకుంటుంటే ఒక్కోసారి ఆనందం గాను , మరి కొన్ని సార్లు బాధ గాను ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మా అని పిలిస్తే పలకడానికి ఒక అమ్మ మాత్రమే ఉంది.    
                 అమ్మమ్మ జ్ఞాపకాలతో మా మామయ్య తీసుకు వచ్చిన కుసుమాంజలి పత్రిక ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కుసుమాంజలి పత్రిక చూడటానికి ఇక్కడ నొక్కండి!!!!

5 comments:

  1. Ammamma gnapakalu chala bagunnayi andi.
    mee chilipi panulu koodaa! naaku thelisi inkaa chaalaane chesuntaru!! konne rasukunnaru em!?

    ReplyDelete
  2. జ్ఞాపకాలు బాగున్నాయి.
    చిలిపి పనుల లిస్టు మాత్రం హబ్బే, అసలెక్కడా దరిదాపుల్లో కూడా లేదు :P

    ReplyDelete
  3. తాత కొడుకు గారు,

    బాగుందండీ, కొత్త విషయాలు తెలిసేయి.

    మీరు డాక్టరు పట్టా పచ్చుకుని స్వచ్చంద సేవా సంస్థ ద్వారా సేవ చెయ్యడం కూడా ముదావహమైన విషయం.

    కుసుమాంజలి భారారె చేసిన మంచి ప్రయత్నం (హారం తో బాటు )

    కొత్త విషయాలు తెలిసేయి నా రాబోయే టపాకి.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. భా .రా. రే , జిలేబి మరియు మహేష్ గార్లకు ధన్యవాదములు....!!!!

    ReplyDelete
  5. bhaa raa re and you are blessed guys.One is serving telugu language and another one is serving telugu people.Good job.keep it up.

    ReplyDelete