Friday, January 20, 2012

అవిభక్త కవలలు ఎలా జన్మిస్తారు...!!!అవిభక్త కవలలు వీణా వాణీ ల భవిష్యత్తు పైన నీలి నీడలు...!!! తప్పు ఎవరిది...??? విశ్లేషణ

             వీణావాణీల గురించి మన తెలుగు వారందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే గత 5 -6 సంవత్సరాలుగా మన మీడియాలో అంతగా నానుతున్న అవిభక్త కవలల పేర్లు అవి. తాజాగా ఈ అవిభక్త కవలల మీద నడుస్తున్న చర్చ నన్ను ఈ టపా రాయడానికి ప్రేరేపించింది. 
అవిభక్త కవలలు ఎలా జన్మిస్తారు?
               సాధారణంగా స్త్రీలలో విడుదలయిన అండం, పురుషుడి శుక్రకణంతో కలిసి ఫలదీకరణం చెంది పిండంగా ఏర్పడుతుంది. ఈ పిండం నవమాసాలు తల్లి గర్భంలో ఉండి శిశువుగా రూపాంతరం చెందుతుంది. సాధారణంగా ఒక తల్లి గర్భంలో ఒక పిండం మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు రెండు అండాలు రెండు శుక్రకణాలతో ఫలదీకరణం చెంది రెండు పిండాలు ఏర్పడతాయి. మరి కొన్ని సార్లు ఒక పిండం రెండుగా విడిపోయి రెండు వేర్వేరు శిశువులుగా రూపాంతరం చెందుతాయి. ఈ రెండు సందర్భాలలోనూ కవలలు జన్మిస్తారు. మొదటి సందర్భంలో జన్మించిన కవలలు ఒకేవిధంగా ఉండరు. కానీ రెండవ సందర్భంలో జన్మించిన కవలలు ఒకే విధంగా ఉంటారు. అయితే రెండవ సందర్భంలో పిండం సరిగా విభజన జరగక పోవడం వలన కానీ లేదా విభజన జరిగిన తర్వాత తిరిగి పాక్షికంగా అతుక్కోవడం గానీ జరిగినపుడు అవిభక్త కవలు ఏర్పడతారు. సాధారణంగా 2,౦౦,౦౦౦ జననాలలో ఒకరికో ఇద్దరికో ఇలా అవిభక్త కవలలు జన్మిస్తారు. ఇలా జన్మించిన వారిలో దాదాపు సగం మంది చనిపోయి జన్మిస్తారు, మరికొంత మంది పుట్టిన తరువాత మరణిస్తారు. కేవలం 25 % మంది మాత్రమే జీవించగలిగే అవకాశం ఉంటుంది.
వీణావాణీల గాధ:

                దాదాపు 8 సంవత్సరాల క్రితం ఈ అవిభక్త కవలలు జన్మించారు. వీళ్ళది వరంగల్ జిల్లాలో ఒక పల్లెటూరు. వీరు జన్మించినపుడు వీరికి ఆపరేషన్ చేయించడానికి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు వీరి తల్లిదండ్రులు. అప్పటికే ఒక అవిభక్త కవలలను విజయవంతం గా విడతీసిన ఘనత అక్కడ అప్పట్లో పనిచేసిన డాక్టర్ నాయుడమ్మ గారికి ఉంది. అయితే వీరికి అన్ని రకాల పరిక్షలు చేసి ఆపరేషన్ చేద్దామనుకునే సమయానికి అప్పటి మీడియా హడావిడి చేయడం వల్ల గానీ, నాయుడమ్మ గారి పదవీ కాలం ముగియడం వల్ల కానీ వీరిని విడతీయలేక పోయారు. తరువాత వీరి తల్లిదండ్రులు వీరిని హైదరాబాద్ లోని నిమ్స్ కి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేయబోయే సమయానికి వీణావాణీల తల్లిదండ్రులు ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టడానికి నిరాకరించే సరికి కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇక్కడ తల్లిదండ్రులు నిరాకరించడానికి ముఖ్య కారణం మీడియానే. ఎవరో ఒకరు చనిపోతారంటూ చానళ్ళు చేసిన హడావిడికి తల్లిదండ్రులు భయపడిపోయారు. ఎంతయినా కన్నవారు కదండీ... కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు ఆపరేషన్ కి ఒప్పుకున్నా డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు. కారణం కేవలం మీడియానే... చివరకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ గారు వీరికి విదేశాలలో ఆపరేషన్ చేయించడానికి కోటి రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే ఆయన మరణంతో తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడంతో వారు ఇప్పటివరకు ఆసుపత్రిలోనే ఉన్నారు.
వీణావాణీల భవిష్యత్తుపైన నీలినీడలు...తప్పు ఎవరిది???
         వీణావాణీల పోషణ పైన అటు తల్లిదండ్రులు ఇటు ప్రభుత్వం ఇద్దరూ లెక్కలు వేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. మన సాంప్రదాయం ప్రకారం పిల్లల్ని కనగానే సరిపోదు. వారి పెంపు భాద్యతలను కూడా చూసుకోవాలి. మాకు పెంచే ఆర్దిక స్తోమత లేదని తల్లిదండ్రులు మీడియా ముఖంగా చెప్పడం మన వ్యవస్థకు అవమానంలా అనిపించింది. ఇక ప్రభుత్వ విషయానికి వస్తే ఇప్పటికయినా సమర్ధమయిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ చేయించడానికి మార్గాలు వెతకాలి. అయితే ఆపరేషన్ విజయవంతం కావాలి, పిల్లలిద్దరూ బతకాలంటే మాత్రం కాస్త కష్ట సాధ్యమయిన పని. అలాంటప్పుడు పిల్లల్ని ప్రభుత్వ ఆశ్రమం లో ఉంచి జీవితాంతం ప్రభుత్వమే కాపాడాలి.

1 comment:

  1. డాక్టరు గారు ఈ విషయం నాకు చాలా బాగా నచ్చింది.... మీకు ఇటువంటి ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు గాని ఇటువంటి విషయాలపై అవగాహన లేనివారికి మాత్రం చాలా ఉపయోగపడతాయి.. ధన్యవాదములు.... ఇలాగే మంచి విషయాలను ప్రచురించండి...

    ReplyDelete