Sunday, April 07, 2013

ఈ వేసవిలో మొదటి మామిడిపండు తిన్నానోచ్ ....!!!

                   ఏదో మామిడి పండు తిన్న ఆనందం. ఆనందాన్ని పది మందితో పంచుకుందాం అని ఇలా ఈ టపా....  

                
            పిడుగురాళ్ళలో జన్మభూమి ఎక్కిన నేను తెనాలిలో భోజనం చేద్దామని అనుకున్నాను. కానీ ఆకలి వేయక పోవడం వలన ఆ ప్రయత్నాన్ని విరమించుకొని అటుగా వచ్చిన సంగం డెయిరీ వారి మజ్జిగ ప్యాకెట్లతో  మ.. మ.. అనిపించేసాను. కానీ ఏలూరు చేరుకునే సరికి జీవుడు విలవిల లాడాడు. ఇంకో రెండు గంటలే కదా అని సరి పెట్టుకుని 4 గంటలకు రాజమండ్రిలో దిగి అత్తారింటికి వెళ్దామని షేర్ ఆటో ఎక్కాను. ఎక్కేటప్పుడు రాజా థియేటర్ దగ్గరకు వెళ్తుందని చెప్పిన ఆటో అన్న కంబాల చెరువు దగ్గరకు రాగానే మాంచి బేరం ఒకటి తగిలేసరికి అక్కడే దించేసి వెళ్లి పోయాడు.
           దీంతో చేసేది ఏమీ లేక కంబాల చెరువు జంక్షన్లో ఇంకో ఆటో కోసం ఆకలి కళ్ళతో ఎదురు చూస్తుంటే అటుగా వచ్చిన మామిడి పండ్ల సైకిల్ని చూసి ఆపుకోలేక ఎంతన్నా... అని ఒక మాట పడేసాను. అసలే గోదావరి నీళ్ళ ప్రభావమో ఏమో గాని గోదావరి జిల్లా వాసులకు మాటలు పెదాల  మీదే ఉంటాయి. ఇప్పుడే మగ్గ పెట్టి తీసుకు వస్తున్నానండీ ... ఆయ్. ఒక్క సారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేత్తదండి... పాతిక తీసుకుంటారా , పరక సరిపోద్దా అండి... అని ఒక్క  సారిగా  మాటలు మొదలెట్టాడు. అసలే ఆకలి కడుపుతో ఉన్న నేను పరక అంటే ఎన్ని కాయలు వస్తాయండి అని ఒక మాట అడిగి వాడికి 100 రూపాయలు ఇచ్చి 13 కాయలు సంచిలో వేసుకుని అత్తారింటికెళ్లి కాయకోసి పెట్టమని అడిగా. సీజన్లో తొలి కాయ కదా అని పరమపదించిన పెద్దల చిత్ర పటాల ముందు ఒక్కో కాయ ఉంచి తర్వాత నాకు కోసి పెట్టడం తో ఈ సీజన్లో తొలి మామిడి కాయ తిన్నట్లయింది. 
         మీకు కూడా మామిడి పండ్లు కావాలంటే చెప్పండి... పార్సిల్ చేసి పంపిస్తా... !!!